ఏడవ అధ్యాయం: విజ్ఞానయోగం శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః | అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1 శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. జ్ఞానం తే௨హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః | యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే || 2 బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ వుండదు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే | యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || 3 ఎన్నో వేలమందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. భూమిరాపో௨నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ | అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా || 4 నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. అవి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ | జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ || 5 అర్జునా! ఇప్పుడు చెప్పింది అపరప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో. ఏతద్యోనీని భుతాని సర్వాణీత్యుపధారయ | అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా || 6 నా ఈ రెండు ప్రకృతులనుంచే సమస్త భూతాలూ పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తూ ఆవిర్భవించడానికీ, అంతం కావడానికీ కారణం నేనే. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ | మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ || 7 ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను. రసో௨హమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః | ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు || 8 కౌంతేయా! నేనే నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, నరులలో పురుషకారంగా వున్నాను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ | జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు || 9 నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ సనాతనమ్ | బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ || 10 పార్థా ! సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధీ, తేజోవంతులలోని తేజస్సూ నేనే. బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ | ధర్మావిరుద్ధో భూతేషు కామో௨స్మి భరతర్షభ || 11 బలవంతులలోని ఆశ, అనురాగం లేని బలాన్ని నేను. ప్రాణులలోని ధర్మవిరుద్ధం కాని కామాన్నీ నేనే. యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే | మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి || 12 సాత్త్విక, రాజసిక, తామసిక భావాలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను; నాలో అవి వున్నాయి. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ | మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ || 13 ఈ మూడుగుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || 14 త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు. న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః | మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || 15 పాపాత్ములు, మూఢులు, మానవాధములు, మాయలోపడి వివేకం కోల్పోయినవాళ్ళు, రాక్షసభావాలను ఆశ్రయించినవాళ్ళు నన్ను పొందలేరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో௨ర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || 16 అర్జునా ! నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు—ఆపదలో వున్నవాడు, ఆత్మతత్త్వం తెలుసుకో గోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే | ప్రియో హి జ్ఞానినో௨త్యర్థమహం స చ మమ ప్రియః || 17 ఈ నలుగురిలో నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేనూ, నాకు అతనూ ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ | ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ || 18 వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే | వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || 19 అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే௨న్యదేవతాః | తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా || 20 తమ తమ పూర్వ జన్మ సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను, వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి | తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ || 21 ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో, అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను. స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే | లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ || 22 అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసే కామితార్థాలనే ఆ దేవతద్వారా పొందుతున్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ | దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి || 23 మందబుద్ధులైన ఈ మానవులు పొందే ఫలితాలు అశాశ్వతాలు. దేవతలను అర్చించేవాళ్ళు దేవతలనే పొందుతారు; నా భక్తులు మాత్రం నన్ను పొందుతారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః | పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || 24 అవివేకులు శాశ్వతం, సర్వోత్తమం అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక నన్ను మానవమాత్రుడిగా తలుస్తారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః | మూఢో௨యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || 25 యోగమాయచేత కప్పబడివున్న నేను అందరికీ కనబడడం లేదు. మూఢప్రపంచం నన్ను పుట్టుక, నాశనం లేనివాడిగా తెలుసుకోలేకపోతున్నది. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున | భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || 26 అర్జునా ! భూతభవిష్యద్వర్తమాన కాలాలకు సంబంధించిన జీవులందరు నాకు తెలుసు. అయితే నేను ఏ ఒక్కడికీ తెలియను. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత | సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప || 27 పరంతపా ! సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగ ద్వేషాలమూలంగా కలిగే సుఖదుఃఖాలవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ | తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః || 28 పుణ్యకర్మలు చేసి సకలపాపాలనూ పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖరూపమైన మోహాలనుంచి విముక్తులై గట్టిపట్టుదలతో నన్ను భజిస్తారు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే | తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ || 29 ముసలితనం, మృత్యువులనుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించేవాళ్ళు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆత్మస్వరూపాన్నీ, సమస్త కర్మలనూ గ్రహించగలుగుతారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః | ప్రయాణకాలే௨పి చ మాం తే విదుర్యుక్తచేతసః || 30
No comments:
Post a Comment