మూడవ అధ్యాయం: కర్మయోగం అర్జున ఉవాచ: జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన | తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1 అర్జునుడు: జనార్దనా ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా ? అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్నెందుకు పురికొల్పుతున్నావు ? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే | తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో௨హమాప్నుయామ్ || 2 అటూయిటూ కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు. శ్రీ భగవానువాచ: లోకే௨స్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా௨నఘ | జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || 3 శ్రీభగవానుడు: అర్జునా ! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. అవి : సాంఖ్యులకు జ్ఞానయోగం, యోగులకు నిష్కామ కర్మయోగం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషో௨శ్నుతే | న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి || 4 కర్మలు చేయనంతమాత్రాన పురుషుడు కర్మబంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మసన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు. న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ | కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః || 5 కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా వుండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతివాళ్ళూ అస్వతంత్రులై కర్మలు చేస్తూనే వున్నారు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ | ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే || 6 పైకి అన్ని కర్మేంద్రియాలనూ అణచిపెట్టి మనసులో మాత్రం విషయ సౌఖ్యాల గురించి ఆలోచించే అవివేకిని కపటాచారం కలవాడు అంటారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే௨ర్జున | కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే || 7 అర్జునా ! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః || 8 నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడ సాగించలేవు. యజ్ఞార్థాత్ కర్మణో௨న్యత్ర లోకో௨యం కర్మబంధనః | తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర || 9 కుంతీపుత్రా ! యాగసంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసారబంధం కలుగజేస్తాయి. కనుక ఫలాపేక్ష లేకుండా దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వమేష వో௨స్త్విష్టకామధుక్ || 10 ప్రాచీనకాలంలో ప్రజలనూ యాగాలనూ సృష్టించి ప్రజాపతి ఇలా అన్నాడు: “యజ్ఞం కోర్కెలను నెరవేర్చే కామధేనువు. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందండి.” దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః | పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ || 11 యజ్ఞయాగాలతో మీరు దేవతలను సంతృప్తి పరచండి. పాడిపంటలు లాంటి సమృద్ధులిచ్చి వారు మీకు సంతోషం కలగజేస్తారు. పరస్పర సద్భావం పరమ శ్రేయస్సు మీకు చేకూర్చుతుంది. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః | తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః || 12 యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీ వాంఛితాలు నెరవేరుస్తారు. దేవతలిచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ, వారికి మళ్ళీ ఆ సంపదలో కొంత కూడా అర్పించనివాడు దొంగ. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః | భుఞ్జతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ || 13 యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్థాలు భుజించే సజ్జనులు సర్వపాపాలనుంచీ విముక్తులవుతున్నారు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్నవాళ్ళు పాపమే తింటున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః | యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || 14 అన్నంవల్ల ప్రాణులన్నీ పుడుతున్నాయి. వర్షం వల్ల అన్నం లభిస్తున్నది. యజ్ఞం మూలంగా వర్షం కలుగుతున్నది. యజ్ఞం సత్కర్మలవల్ల సంభవిస్తున్నది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ | తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ || 15 కర్మ వేదంనుంచి పుట్టింది. పరమాత్మవల్ల వేదం వెలసినది. అంతటా వ్యాపించిన పరమాత్మ అందువల్లనే యజ్ఞంలో ఎప్పుడూ వుంటాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః | అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి || 16 పార్థా ! ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించనివాడు పాపి; ఇంద్రియలోలుడు. అలాంటివాడి జీవితం వ్యర్థం. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః | ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే || 17 ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుక్తకర్మలేవీ వుండవు. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన | న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః || 18 అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయడంవల్ల కాని, మానడం వల్ల కాని ప్రయోజనం లేదు. స్వార్థదృష్టితో సృష్టిలో దేనినీ అతను ఆశ్రయించడు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర | అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః || 19 అందువల్ల నిరంతరం నిష్కామంగా కర్మలు ఆచరించు. అలా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాళ్ళకు మోక్షం కలుగుతుంది. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః | లోకసంగ్రహమేవా௨పి సంపశ్యన్ కర్తుమర్హసి || 20 జనకుడు మొదలైనవారు నిష్కామకర్మతోనే మోక్షం పొందారు. లోకక్షేమం కోసమైనా నీవు సత్కర్మలు చేయాలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః | స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22 పార్థా ! ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిదికాని, కావలసింది కాని ఏమీ లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వర్తిస్తూనే వున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః | మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23 అర్జునా ! ఏమాత్రమూ ఏమరుపాటు లేకుండా నేను నిరంతరం కర్మలు చేయకపోతే, ప్రజలంతా అలాగే ప్రవర్తిస్తారు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ | సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24 నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతా భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకూ, ప్రజలనాశానికి నేనే కర్తనవుతాను. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత | కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ || 25 అర్జునా ! అజ్ఞానులు ఫలితాలు ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోకకల్యాణం కోసం కర్తవ్యకర్మలు ఆచరించాలి. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ | జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ || 26 ఫలం కోరి కర్మలు చేసే పామరుల బుద్ధిని విజ్ఞులు వికలం చేయకూడదు. జ్ఞాని యోగిగా సమస్తకర్మలూ చక్కగా ఆచరిస్తూ ఇతరులు చేతకూడా చేయించాలి. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః | అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే || 27 ప్రకృతిగుణాలవల్ల సర్వకర్మలూ సాగుతుండగా, అజ్ఞాని అహంకారంతో, కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః | గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే || 28 గుణాలు, కర్మల నిజస్వరూపం తెలిసిన తత్వవేత్త ఇంద్రియరూపాలైన గుణాలు విషయరూపాలైన గుణాలమీదే నిలిచి వున్నాయని గ్రహించి వాటి దరికి చేరడు. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు | తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ || 29 ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులూ, మందబుద్ధులూ అయినవాళ్ళ మనస్సులను జ్ఞానులు చలింపచేయకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా | నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః || 30 నీవు చేసే సమస్త కర్మలూ నాకు సమర్పించి, వివేకంతో ఆశామమకారాలు విడిచిపెట్టి నిశ్చింతగా యుద్ధం చెయ్యి. యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః | శ్రద్ధావంతో௨నసూయంతో ముచ్యంతే తే௨పి కర్మభిః || 31 అసూయలేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధాలనుంచి విముక్తులవుతారు. యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ | సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః || 32 నేను ఉపదేశించిన ఈ నిష్కామకర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించనివాళ్ళు అవివేకులూ, అజ్ఞానులూ, అన్నివిధాల చెడిపోయినవాళ్ళూ అని తెలుసుకో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి | ప్రకృతం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి || 33 పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది? ఇంద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ | తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ || 34 ఇంద్రియాలన్నిటికీ తమతమ విషయాలపట్ల అనురాగం, ద్వేషం వున్నాయి. ఎవరూ వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు. శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 35 ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే. అర్జున ఉవాచ: అథ కేన ప్రయుక్తో௨యం పాపం చరతి పూరుషః | అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః || 36 అర్జునుడు: కృష్ణా ! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతంవల్ల పాపాలు చేస్తున్నాడు? శ్రీ భగవానువాచ: కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః | మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ || 37 శ్రీ భగవానుడు: రజోగుణంవల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకూ మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివితీరని కామమూ, మహాపాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మనవుడికి మహాశత్రువులు. ధూమేనావ్రియతే వహ్నిః యథా௨దర్శో మలేన చ | యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్ || 38 పొగ అగ్నినీ, మురికి అద్దాన్నీ, మావి గర్భంలోని శిశువునూ కప్పివేసినట్లు కామం ఆత్మజ్ఞానాన్ని ఆవరించింది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా | కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ || 39 అర్జునా ! ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మజ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది. ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే | ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ || 40 ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటిద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహధారులకు మోహం కలగజేస్తున్నది. తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ | పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ || 41 అర్జునా ! అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పుచేతల్లో వుంచుకుని, జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని పారద్రోలు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః | మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || 42 దేహంకంటే ఇంద్రియాలు గొప్పవి. మనస్సు ఇంద్రియాలకంటే శ్రేష్ఠం. బుద్ధి మనస్సు కంటే అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా | జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ || 43
No comments:
Post a Comment