పదిహేనవ అధ్యాయం: పురుషోత్తమప్రాప్తియోగం శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ | ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 1 శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః | అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే || 2 ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ మీదకీ విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాలవల్ల దానివేళ్ళు దట్టంగా క్రిందకి కూడా వ్యాపిస్తాయి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా | అశ్వత్థమేనం సువిరూఢమూలమ్ అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా || 3 తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్‌గతా న నివర్తంతి భూయః | తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || 4 ఈ సంసారవృక్షం స్వరూపంకాని, ఆదిమధ్యాంతాలుకాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించివేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెదకాలి. ఆనాదిగా ఈ సంసారవృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి – పరమాత్మను శరణుపొందాలి. నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః | ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ || 5 అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కోరికలన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః | యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ || 6 దాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపచేయ లేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కరలేదో అలాంటి పరంధామం నాది. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః | మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి || 7 నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆకర్షిస్తుంది. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః | గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ || 8 వాయువు పువ్వులనుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, విడిచిపెట్టేటప్పుడూ ఇంద్రియాలనూ, మనస్సునూ వెంటబెట్టుకు పోతాడు. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ | అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే || 9 ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ | విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః || 10 మరో శరీరాన్ని పొందుతున్నప్పుడూ, శరీరంలో వున్నప్పుడూ, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతోకూడి వున్నప్పుడూ కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగినవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ | యతంతో௨ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః || 11 ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మసంస్కారంలేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే௨ఖిలమ్ | యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ || 12 సూర్యుడిలో వుండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సూ, చంద్రుడిలో, అగ్నిలోవుండే తేజస్సూ నాదే అని తెలుసుకో. గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా | పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః || 13 నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలనూ ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలనూ పోషిస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || 14 “ వైశ్వానరుడు” అనే జఠరాగ్నిరూపంతో సకలప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణాపానవాయువులతో కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ | వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || 15 సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నిటివల్ల తెలుసుకోవలసిన వాణ్ణి నేనే. వేదాంతాలకు కర్తనూ, వేదాలను ఎరిగినవాణ్ణీ నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ | క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే || 16 ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. నశించే సమస్తప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ మార్పులేని జీవుణ్ణి అక్షరుడనీ అంటారు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః | యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః || 17 ఈ వుభయులకంటే ఉత్తముడు నాశనంలేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ. యస్మాత్ క్షరమతీతో௨హమక్షరాదపి చోత్తమః | అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః || 18 నేను క్షరుడిని మించినవాడినీ, అక్షరుడికంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ | స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత || 19 అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్నివిధాల నన్నే ఆరాధిస్తాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ | ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత || 20
No comments:
Post a Comment