ఆరవ అధ్యాయం: ఆత్మసంయమయోగం శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః | స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః || 1 శ్రీ భగవానుడు: కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతేకానీ అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంతమాత్రాన కాడు. యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ | న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || 2 పాండునందనా ! సన్యాసమూ, కర్మయోగమూ ఒకటే అని తెలుసుకో. ఎందువల్లనంటే సంకల్పాలను వదిలిపెట్టనివాడెవడూ యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే | యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే || 3 ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ధి పొందినవాడికి కర్మత్యాగమే సాధనం. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే | సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే || 4 ఇంద్రియ విషయాలమీద కాని, కర్మలమీదకాని ఆసక్తి లేకుండా సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ | ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || 5 తనమనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా. కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలుచేసుకోకూడదు. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః | అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ || 6 మనస్సును స్వాధీనపరచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించనవాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః | శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః || 7 ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలపట్ల సమభావం కలిగివుంటాడు. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః | యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || 8 శాస్త్రజ్ఞానంవల్ల, అనుభవజ్ఞానంవల్ల సంతృప్తి చెందినవాడు, నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టినీ రాతినీ బంగారాన్నీ సమదృష్టితో చూసేవాడూ యోగి అని చెప్పబడుతాడు. సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు | సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || 9 శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి—వీళ్ళందరిపట్ల సమబుద్ధి కలిగినవాడే సర్వోత్తముడు. యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః | ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || 10 యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి, ఆశలను వదలి, ఇంద్రియాలనూ మనస్సునూ వశపరచుకుని, ఏమీ పరిగ్రహించకుండా చిత్తాన్ని ఆత్మమీదే నిరంతరం నిలపాలి. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః | నాత్యుచ్ఛ్రిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 11 ఎక్కువ ఎత్తూ పల్లమూకాని పరిశుద్ధమైన ప్రదేశంలో దర్భలు పరచి, దానిమీద చర్మమూ, ఆపైన వస్త్రమూ వేసి తన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః | ఉపవిశ్యాసనే యుంజ్యాత్, యోగమాత్మవిశుద్ధయే || 12 ఆ ఆసనంమీద కూర్చుని, ఇంద్రియాలనూ మనస్సునూ స్వాధీన పరచుకుని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధికోసం యోగాభ్యాసం చేయాలి. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః | సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా௨నవలోకయన్ || 13 ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః | మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14 శరీరమూ, శిరస్సూ, కంఠమూ కదలకుండా సమంగా, స్థిరంగా వుంచి, దిక్కులు చూడకుండా ముక్కుచివర దృష్టినిలిపి, ప్రశాంతచిత్తంతో భయం విడిచిపెట్టి, బ్రహ్మచర్యవ్రతం అవలంబించి, మనోనిగ్రహం కలిగి, బుద్ధిని నామీదే లగ్నం చేసి, నన్నే పతిగా, గతిగా భావించి ధ్యానంచేయాలి. యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః | శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి || 15 అలాంటి యోగి ఆత్మానుభవంమీద మనస్సును నిరంతరం నిలిపి, నా ఆధీనంలోవున్న మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు. నాత్యశ్నతస్తు యోగో௨స్తి న చైకాంతమనశ్నతః | న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 16 అర్జునా ! అమితంగా భుజించేవాళ్ళకీ, బొత్తిగా తిననివాళ్ళకీ, అత్యధికంగా నిద్రపోయేవాళ్ళకీ అసలు నిద్రపోనివాళ్ళకీ యోగం సిద్ధించదు. యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు | యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 17 ఆహార విహారాలలో, కర్మలలో, నిద్రలో, మేల్కొనడంలో పరిమితి పాటించే యోగికి సర్వదుఃఖాలూ పోగొట్టే యోగసిద్ధి కలుగుతుంది. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే | నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18 మనస్సును వశపరచుకుని ఆత్మమీదే నిశ్చలంగా నిలిపి, సర్వావాంఛలూ విసర్జించినప్పుడు యోగసిద్ధి పొందాడని చెబుతారు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా | యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః || 19 ఆత్మయోగం అభ్యసించేవాడి మనస్సు గాలిలేనిచోట వుండే దీపంలాగ నిలకడగా వుంటుంది. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా | యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి || 20 సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ | వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః || 21 యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః | యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 22 తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ | స నిశ్చయేన యోక్తవ్యో యోగో௨నిర్విణ్ణచేతసా || 23 ఏ స్థితిలో మనస్సు యోగాభ్యాసంవల్ల నిగ్రహించబడి శాంతిని పొందుతుందో, యోగి ఎప్పుడు పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను తనలోనే సందర్శిస్తూ సంతోషిస్తున్నాడో; ఇంద్రియాలకు గోచరించకుండా బుద్ధివల్లనే గ్రహించబడే అనంతసుఖాన్ని అనుభవిస్తున్నాడో, ఆత్మతత్వంనుంచి ఏ మాత్రమూ చలించడో; దేనినిపొంది, దానికి మించిన లాభం మరొకటి లేదని భావిస్తాడో, ఏ స్థితిలో స్థిరంగా వుండి దుర్భరదుస్సహదుఃఖానికయినా కలత చెందడో; దుఃఖాలకు దూరమైన అలాంటి దానినే యోగమంటారు. దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః | మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || 24 శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా | ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 25 సంకల్పంవల్ల కలిగే సకలవాంఛలనూ సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియాలన్నిటినీ సమస్తవిషయాల నుంచి మనస్సుతోనే మళ్ళించి, బుద్ధి ధైర్యంతో మనస్సును ఆత్మమీదే నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి. ఏ మాత్రమూ ఇతర చింతనలు చేయకూడదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ | తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ || 26 చంచలమూ అస్థిరమూ అయిన మనస్సు ఏయే విషయాల మీదకు వెడుతుందో ఆయా విషయాలనుంచి దానిని మళ్ళించి ఆత్మమీదే నిలకడగా వుంచాలి. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ | ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ || 27 ప్రశాంతమైన మనస్సుకలిగినవాడు, కామక్రోధాది ఉద్రేకకారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు అయిన యోగపురుషుడికి పరమ సుఖం లభిస్తుంది. యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః | సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే || 28 ఇలాగ మనస్సు నెప్పుడూ ఆత్మమీద లగ్నంచేసి పాపరహితుడైన యోగి అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని | ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29 యోగసిద్ధి పొందినవాడు సమస్తభూతాలపట్ల సమభావం కలిగి సర్వభూతాలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వభూతాలనూ సందర్శిస్తాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30 అన్ని భూతాలలో నన్నూ, నాలో అన్ని భూతాలనూ చూసేవాడికి నేను లేకుండా పోను; నాకు వాడు లేకుండా పోడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః | సర్వథా వర్తమానో௨పి స యోగీ మయి వర్తతే || 31 సమస్తభూతాలలో వున్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే వుంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో௨ర్జున | సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || 32 అర్జునా ! సమస్త జీవుల సుఖదుఃఖాలను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్టుడని నా అభిప్రాయం. అర్జున ఉవాచ: యో௨యం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన | ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || 33 అర్జునుడు: మధుసూదనా! మనస్సు నిలకడలేనిదికావడంవల్ల, నీవు ఉపదేశించిన ఈ జీవాత్మపరమాత్మల సమత్వయోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ | తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || 34 కృష్ణా! మనస్సు చాలా చంచలం, బలవత్తరం, సంక్షోభకరం. అలాంటి మనస్సును నిగ్రహించడం వాయువును నిరోధించడంలాగ దుష్కరమని భావిస్తున్నాను. శ్రీ భగవానువాచ: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ | అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || 35 శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు చంచల స్వభావం కలిగిందీ, నిగ్రహించడానికి శక్యం కానిదీ అనడంలో సందేహం లేదు. అయితే దానిని అభ్యాసంవల్ల, వైరాగ్యంవల్ల వశపరచుకోవచ్చు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః | వశ్యాత్మనా తు యతతా శక్యో௨వాప్తుముపాయతః || 36 ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్ధించదని నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం వుంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు. అర్జున ఉవాచ: అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః | అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37 అర్జునుడు: శ్రద్ధవున్నప్పటికీ మనో నిగ్రహం లోపించిన కారణంగా యోగంలో చిత్తం చలించినవాడు యోగసంసిద్ధి పొందకుండా ఏ గతి పొందుతాడు? కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి | అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి || 38 అర్జునుడు: కృష్ణా! మోక్షసంపాదన మార్గంలో నిలకడలేనివాడు ఇహపరసౌఖ్యాలు రెండింటికీ భ్రష్టుడై చెదరిన మేఘాలలాగ చెడిపోడు కదా! ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః | త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || 39 కృష్ణా! ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమర్థుడవు. ఈ సంశయాన్ని తీర్చడానికి నిన్ను మించినవాడు మరొకడెవ్వడూ లేడు. శ్రీ భగవానువాచ: పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే | న హి కల్యాణకృత్ కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40 శ్రీ భగవానుడు: అర్జునా! యోగభ్రష్టుడికి ఈ లోకంలో కాని, పరలోకంలోకాని ఎలాంటి హానీ కలుగదు. నాయనా! మంచిపనులు చేసిన మానవుడెవడూ దుర్గతి పొందడు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః | శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో௨భిజాయతే || 41 యోగభ్రష్టుడు పుణ్యకర్మలు చేసేవాడు పొందే ఉత్తమలోకాలు చేరి, చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నులైన భాగ్యవంతుల యింట్లో జన్మిస్తాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ | ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42 లేకపోతే బుద్ధిమంతులైన యోగుల వంశంలోనే పుడుతాడు. అయితే అలాంటి జన్మ ఈ లోకంలో పొందడం ఎంతో దుర్లభం. తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ | యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన || 43 అర్జునా! అలా యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంస్కార విశేషంవల్ల సంపూర్ణయోగసిద్ధికోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో௨పి సః | జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే || 44 పూర్వజన్మలోని అభ్యాసబలం మూలంగా ఆ యోగభ్రష్టుడు తాను తలపెట్టకపోయినా మళ్ళీ యోగసాధనవైపుకు లాగబడుతాడు. యోగస్వరూపాన్ని తెలుసుకోదలచినవాడుకూడా వేదాలలో వివరించబడ్డ కర్మలు ఆచరించేవాడిని మించిపోతాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః | అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ || 45 పట్టుదలతో ప్రయత్నించే యోగి పాపవిముక్తుడై అనేక జన్మలకు సంబంధించిన సాధనాసంపర్కంవల్ల యోగసిద్ధి, తరువాత మోక్షఫలం పొందుతాడు. తపస్విభ్యో௨ధికో యోగీ జ్ఞానిభ్యో௨పి మతో௨ధికః | కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 46 అర్జునా! తపస్సు చేసేవాళ్ళకంటే, శాస్త్రజ్ఞానం కలవాళ్ళకంటే, యోగులకంటే ధ్యానయోగి గొప్పవాడు. కనుక నీవు ధ్యానయోగం సాధించాలి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా | శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః || 47
No comments:
Post a Comment